అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. ఆయిట్ మెంట్ పూయనూ లేదు. మొహమే చూపించలేదు.. మాట కలపనే లేదు. ఒక ముఖ్యమంత్రి.. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు ఉన్న నాయకుడు.. ఒక రాష్ట్రంలో 50 శాతం పైగా ఓట్లు పొందిన నాయకుడు.. అయినా ఏం సుఖం.. ఢిల్లీకి పోతే దిక్కు లేకుండా పోయింది. కనీస మర్యాదకైనా.. కరచాలనం చేసే కేంద్ర నాయకులు కరువయ్యారు. ఏంటీ పరిస్ధితి? ఏంటీ దుస్ధితి? ఇది కేంద్రంలోని కమలనాథుల బలుపు అనుకుని ఆగ్రహించాలా.. .. లేక కేసుల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేసినందుకు బాధపడాలో అర్ధం కాకుండా పోయింది పరిస్ధితి. నాడు చంద్రబాబునాయుడు, నేడు జగన్మోహన్ రెడ్డి.. ఇద్దరూ ఏపీ ముఖ్యమంత్రులే.. ఇద్దరికీ హస్తినలో ఇవే అనుభవాలు. వారిద్దరూ వ్యక్తిగతంగా ఏమనుకున్నారో అనవసరం.. అవమానాలు మాత్రం ఆంధ్ర ప్రజలకు జరుగుతున్నట్లే ఉంది.
కనీసం చంద్రబాబునాయుడు గొంతెత్తి.. రాజకీయాల కోసమైనా.. బీజేపీని విమర్శించారు. కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గొంతెత్తడం కాదు కదా.. కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు. కారణం సీబీఐ కేసులు.. మెడపై వేలాడుతున్న కత్తిలా.. బెయిల్ ఎప్పుడు రద్దవుతుందో తెలియని పరిస్థితి. ముందు దూకుడుగాను, ఆలోచనల్లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పాములుగా మారి కాటు వేస్తుంటే.. ప్రత్యర్ధులు వాటి వెనకనే ఉండి బుసలు కొడుతుంటే.. ఏం చేయాలో అర్ధం కాక.. మళ్లీ ఇప్పుడు హస్తినవైపు దిక్కులు చూస్తున్నారు. వారు మాత్రం దిక్కులేని వాడిలా ఈయనను చూస్తున్నారు. వీటన్నిటికి ఫలితం అనుభవిస్తుంది.. ఆంధ్ర ప్రజలు. పోలవరంకు బిల్లులు చెల్లించరు.. ఒక రాష్ట్రానికి మూలకేంద్రంగా ఉండాల్సిన రాజధాని ఏమైపోయినా పట్టించుకోరు. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు. ఆర్ధికంగా ఇంత కష్టాల్లో ఉన్నా.. తన అధికారం నిలబెట్టుకోవడం కోసం.. ఉన్న డబ్బులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టేస్తూ.. తర్వాత రాష్ట్రం పరిస్ధితి ఏంటనే ఆలోచన కూడా లేకుండా ముఖ్యమంత్రి చప్పట్లు కొట్టించుకుంటూ సాగిపోతున్నారు.
అడగాల్సిన మీడియా ప్రభుత్వ ప్రకటనలతో వచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి కాళ్లు బారజాపి కూర్చుంది. ఇవన్నీ కాక.. బీజేపీ, వైసీపీలు పోటీ పడి.. టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునే పనిలో బిజీ అయిపోయాయి. మరోవైపు టీడీపీ తన అస్ధిత్వం నిలబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టింది. సమస్యలకన్నా.. తమ నేతలపై కేసులే ముఖ్యమన్న చందంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. వారి గొడవ వారిది. ఇలా నేతలు, పార్టీలు ఎవరి ఈక్వేషన్లలో వారు ఉండిపోతే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక అనాథలా మారిపోయింది. ఆంధ్ర ప్రజలు చర్చలు జరిపి.. నలుగురూ కలిసి నాలుగు తిట్లు తిట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.