ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం పాలవ్వడంతో కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. బీజేపీ కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా ఆలోచనా విధానానికి అనుగుణంగా బీజేపీ లో, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో యువకులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. దానిలో భాగంగానే దక్షిణ బెంగళూరు ఎంపీ 29 సంవత్సరాల తేజస్వి సూర్య, లద్దాఖ్ కు చెందిన 35 ఏళ్ల జమ్యాంగ్ ట్సెరింగ్ నంగ్యాల్, హుగ్లీ ఎంపీ లాకెట్ చటర్జీ (45), పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్, పశ్చిమ మిడ్నాపూర్ ఎంపీ దిలీప్ ఘోష్ లను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు సమాచారం.
ఏప్రిల్ మొదటి వారంలో జేడీ (యు), వైసీపీ, ఏఐఏడీఎంకె లకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఆయా పార్టీలతో ప్రధాన మంత్రి సంప్రదింపులు కొనసాగిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్ లో బీహార్…పశ్చిమ బెంగాల్, తమిళనాడు లకు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీనియర్ బీజేపీ లీడర్లను తొలగించి యువకులకు అవకాశం కల్పించాలనే పట్టుదలతో ప్రధాన మంత్రి ఉన్నారు. మంత్రి పదవులు కోల్పోయే వారి పేర్లలో ముఖ్యంగా ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మార్చి మొదటి వారంలో జరిగే బీజేపీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మంత్రి పదవి కోల్పోయిన సీనియర్లను నడ్డా టీమ్ లో పార్టీ జనరల్ సెక్రెటరీలుగా బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలిసింది.
ఇటీవల రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో మంత్రి పదవుల విషయమై ప్రధానితో చర్చించారని…ప్రధాని సూచనతో అమిత్ షాను కలిసినట్టు తెలిసింది. 22 మంది ఎంపీలున్న వైఎస్సార్ కాంగ్రెస్ కు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులను, 16 ఎంపీలున్న జేడీ(యు) కు ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో బీజేపీ మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఏఐఏడీఎంకే కు ఒక ఎంపీ నే ఉన్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తో ఉన్న ఒప్పందాల మేరకు రెండు మంత్రి పదవులు దక్కనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైసీపీ నుంచి రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి లకు, ఏఐఏడీఎంకే నుంచి ఓపీ రవీంద్రనాథ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వైతిలింగం కు మంత్రి వర్గంలో స్థానం లభించనుంది. అదే విధంగా జేడీ (యు) నుంచి ముంగేర్ ఎంపీ రాజీవ్ రంజన్ లలన్ సింగ్, సివాన్ ఎంపీ కవితా సింగ్ లకు మంత్రి పదవులు ఇవ్వనున్నారు. అయితే అన్నా డీఎంకే రైల్వే శాఖను అడుగుతుందని…మోదీ మాత్రం ఆ శాఖను జేడీ(యు) ఇవ్వాలనుకుంటున్నట్ట తెలిసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతంలో రైల్వే మంత్రిగా పని చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో జేడీ(యు) మరోసారి రైల్వే శాఖను కోరుతోంది.