శివసేన, ఆ పార్టీ గుర్తు సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతుందంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంపై ఉద్దవ్ ఠాక్రే వర్గం తప్పుపట్టింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఎన్నికల సంఘంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని ఆమె అన్నారు. అలాంటి సంస్థ శివసేన ఎవరికి చెందుతుందో తేల్చే విషయంలో అనుసరించిన తీరు తమను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఎన్నికల సంఘం తీరు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
ప్రజస్వామ్యాన్ని, చట్టాన్ని, కాపాడాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం విడ్డూరమనిపిస్తోందన్నారు. ఈసీఐ అంటే ‘ఎంటైర్‌లీ కాంప్రమైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’అన్నట్లుగా ప్రవర్తిస్తోందని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సంఘాన్ని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను (సీబీఐ)లను బీజేపీ తన టూల్ కిట్స్ గా వినియోగించుకుంటోందని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీ కన్నున న్యాయవ్యవస్థపై పడిందని ఆరోపించారు.
ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అందుకే ఇప్పుడు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.