తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర పార్టీ హైకమాండ్‌ను బాగానే మెప్పిస్తున్నట్టుంది. పార్టీ బలోపేతం కోసం కదిలిన బండికి అడుగడుగునా అండగా నిలబడుతూ, మరింత ఉత్సాహంగా ముందుకు సాగేలా చేస్తోంది. ప్రజా సంగ్రామయాత్రకు జాతీయస్థాయిలో సైతం ప్రచారం దక్కేలా .. తెలంగాణ నాయకత్వానికి చేయూతనిస్తోంది. వరుసగా కేంద్ర పెద్దలని, జాతీయస్థాయినేతలని ప్రజా సంగ్రామ యాత్రకు పంపుతూ.. బండికి నైతిక బలాన్ని అందిస్తోంది. దీంతో బండి వెంట సాగుతున్న పార్టీ శ్రేణులకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టు అవుతోంది.
తెలంగాణ బీజేపీలో వర్గపోరు ఉందన్న వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పార్టీ సారథి సంజయ్ అయినా.. క్యాడర్‌ను కిషన్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నారన్న మాటలు వినిపిస్తుంటాయి. అయితే అలాంటి అభిప్రాయాలకు చెక్ పెట్టేలా.. సంజయ్ పాత్ర సాఫీగా సాగేలా చేస్తోంది హైకమాండ్. తెలంగాణ నేతలు మాత్రమే యాత్రలో ఎన్ని మైళ్లు నడిచినా, రావాల్సిన మైలేజీ రాదని గ్రహించి.. తరచూ నేషనల్ ఫిగర్లను సంజయ్ కోసం పంపుతోంది. బండికి హైకమాండ్ ఆశీర్వాదాలు, జాతీయస్థాయి నేతల సహాయ సహకారాలు ఉంటాయన్న ఉంటాయన్న సందేశాన్ని స్పష్టంగా పంపుతోంది. దీంతో రాష్ట్ర బీజేపీలో గ్రూపులు లేవన్న విషయం అర్థం చేసుకుంటున్న న్యూట్రల్ క్యాడర్ కూడా.. బండి వెంట అన్‌డౌట్‌ఫుల్‌గా సాగుతోంది.
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్, అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, తాజాగా మరో కేంద్ర మంత్రి భగవత్ … ఇలా ఒక్కక్కరుగా వచ్చి బండి వెంట సాగుతూ.. పార్టీలో జోష్ నింపి వెళ్తున్నారు. మరోవైపు బండికి ఇన్నాళ్లు అంటీముట్టనట్టుగా ఉన్న నేతలు కూడా తాజా యాత్రతో మనసు మార్చుకోవాల్సి వస్తోంది. ఇది కేవలం రాష్ట్ర నాయకత్వం తలపెట్టిన ప్రోగ్రామ్ మాత్రమే కాదని.. హైకమాండ్ చూస్తోందని తెలిసిన అనివార్యంగా సంజయ్ పాదయాత్రకు సంఘీభావం తెలపాల్సి వస్తోంది. మొత్తంగా బండి ప్రజా సంగ్రామ యాత్ర.. పార్టీకే కాక ఆయనకూ వ్యక్తిగతంగా మైలేజ్‌ను పెంచుతోంది.