బీజేపీ వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తుంది. విజయపరంపరను కంటిన్యూ చేస్తూ.. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఆదివారం అసోంలోని గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ కూటమి ఘన విజయం సాధించి విజయభేరి మోగించింది.
గువాహటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 వార్డుల్లో 58 వార్డులు కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు 52 వార్డుల్లో గెలుపొందగా, 7 వార్డులలో పోటీ చేసిన ఏజేపీ 6 వార్డులు దక్కించుకుంది. అసోంలో తొలిసారిగా బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అసోం జాతీయ పరిషత్ (ఏజేపీ) ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. ఇక, కాంగ్రెస్ పార్టీకి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో హస్తం నేతలు ఖంగుతిన్నారు.
అయితే, బీజేపీ 53 వార్డుల్లో పోటీకి నిలబడగా, కాంగ్రెస్ 55 వార్డుల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ 39 వార్డుల్లో పోటీచేసి ఒక వార్డు దక్కించుకోవడం ద్వారా గౌహతిలో అడుగుపెట్టింది. ఎన్నికల ఫలితాల అనంతరం అసోం సీఎం హిమంత్ బిస్వాస్ శర్మ.. ప్రజలకు శిరసువంచి అభివాదం చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెలలో రాష్ట్ర మున్సిపల్ బోర్డులకు జరిపిన ఎన్నికల్లోనూ బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు ఇదే తరహా విజయం సాధించారు.
ఇక జీఎంసీకి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించారు. 2013లో చివరిసారిగా ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ, కౌన్సిలర్ల మధ్య దీర్ఘకాలం జరిగిన ఘర్షణలతో వారంతా బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో బీజేపీ గువహతి మున్సిపల్ బోర్డును కైవసం చేసుకుంది.