ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని బిజెపి నేతలు స్పష్టం చేస్తుండటంతో ఎపి రాజకీయం చర్చనీయాంశంగా మారింది… త్వరలోనే అధికారం చేపడతామని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎటువంటి ఎత్తుగడలకు దారితీస్తుందో రాజకీయ విశ్లేషకుల కు కూడా అర్థం కాని అంతుచిక్కని విధంగా నెలకొంది… ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలు ప్రజల అభిమానాన్ని చూరగొన లేకపోయాయి గత ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు మాత్రమే తమ ఉనికిని చాటుకున్నాయి… అధికారం చేపట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం తో ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది..175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు ప్రభుత్వం ఏర్పడి 4 నెలల సమయం కూడా పూర్తి కాలేదు కానీ బిజెపి నేతలు మాత్రం భారతీయ జనతా పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని నొక్కి నొక్కి చెప్పడం లో అర్థం ఏమిటనేది రాజకీయంగా చర్చకు దారితీస్తుంది.
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం మరో వైపు బిజెపి లో కూడా ఇతర పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున చేరడం భవిష్యత్తులో మరికొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకోనుండటం ఇటువంటి పరిణామాలతో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఏపీలో త్వరలో అధికారం చేపడుతుందని ఆ పార్టీ నేతలు చెప్పడం లేదు ఇంకా ఏదో బలమైన ఆలోచన అంతే బలమైన ఉద్దేశం తోనే బిజెపి నేతలు పదేపదే ఏపిలో అధికారం చేపట్టడం ఖాయమని వ్యాఖ్యలు చేస్తున్నారని భావించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి..
ఇప్పటికే అనేకమంది ఇతర పార్టీల నేతలను మాజీ మంత్రులను వివిధ కేసుల్లో అరెస్టులు చేయించి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పార్టీలో చేర్చుకుంటున్న సందర్భాలను చూశాం… ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ వివిధ కేసుల కారణంగా కేంద్రం చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితి.. అవినీతి అక్రమాల కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కూడా అరెస్టు చేసి తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఖాళీ చేయించిన తర్వాత అదే ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పై కూడా ప్రయోగించాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉన్నట్లు భావించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
బిజెపి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మిట్ ది ప్రెస్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు గాని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గాని చెప్పిన జవాబులు పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ఒక బలమైన కాన్సెప్ట్ తోనే ఏపీ రాజకీయాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటవుతుందని గత ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన శిలా పలకాలు సాక్షిగా రాజధాని ప్రశ్నార్థకంగా మారింది. గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో వ్యవహరిస్తున్న విధానాలు అభివృద్ధి పనుల్లో అవినీతి ని వెలికి తీస్తున్న కమిటీల నివేదికలు వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని ఇప్పుడు బీజేపీ నేతలు తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం క్వశ్చన్ మాత్రమే చేస్తున్న బిజెపి నేతలు త్వరలో వీటిపై తీసుకోనున్న చర్యలు ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం తో పాటు ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుని వైసిపి ప్రభుత్వాన్ని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చాప కింద నీరులా జరుపుతున్నట్లు తెలుస్తుంది
తమకు అధికారం ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రస్తావన కేంద్రం వద్ద బలంగా తెచ్చినట్లు కనబడలేదు..
దీన్ని ఆసరాగా చేసుకొని టిడిపి జనసేన పార్టీలు వైసీపీపై విమర్శలు కురిపిస్తూ రాజకీయంగా ముందుకు సాగుతున్నాయి అంతేకాకుండా అవకాశం దొరికినప్పుడల్లా ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి… ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నిశ్శబ్దంగా హెచ్చరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుచుకునెందుకు వ్యూహాలను సిద్ధం చేస్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వలన రాష్ట్రం అభివృద్ధి జరగదని టిడిపి లేదా వైసిపి వచ్చిన అబివృద్ది ఉండదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రకరకాల ప్రణాళికతో ముందుకు వెళుతుంది ప్రాంతీయ పార్టీలను భయపెట్టి బయో ఆందోళనకు గురి చేసి ఆ పార్టీ నేతలు చేసిన తప్పులను తమకు అనుకూలంగా మార్చుకుని భారతీయ జనతా పార్టీలోకి పార్టీలను విలీనం చేసి తద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బిజెపి పాగా వేయాలని ఆలోచన అందుకు అనుగుణంగా కార్యచరణ చకచకా చేస్తున్నట్లు తెలుస్తుంది…
ప్రభుత్వం ఏపీకి రాజధాని తుళ్ళూరు ప్రాంతంలో నిర్మిస్తామని పనులు ప్రారంభిస్తే ప్రస్తుత ప్రభుత్వం మరో చోట రాజధాని నిర్మించాలనే ఆలోచన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వందే తుది నిర్ణయమని తనకు సంబంధం లేదని జీవీఎల్ పేర్కొనడం కూడా అనేక ఆలోచనలకు తావిస్తోంది. మొత్తానికి రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను పూర్తిగా బలహీనపరిచి భారతీయ జనతా పార్టీలో ఆయా పార్టీ నేతలను చేర్చుకొని తద్వారా అధికారం చేపట్టాలని ఆలోచనకు వేగంగా పావులు కదుపుతున్నట్లు భావించాల్సి వస్తుంది. మరి భవిష్యత్తు పరిణామాలు ఎటువైపు నుండి ఎటువైపు దారితీస్తాయో ఎవరికీ అంతుబట్టని అంతుచిక్కని భారతీయ జనతా పార్టీ నేతలు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది