రోజురోజుకి పరిణామాలు.. ఆంధ్రప్రదేశ్ బిజెపి గుప్పిట్లోకి వెళ్లేలా జరుగుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే సీబీఐ కేసులతో జగన్.. ప్రత్యేక హోదా డిమాండ్ కూడా చేయలేని పరిస్ధితిలో పడిపోయారు. రాష్ట్రంలో సొంత యవ్వారాలకు మాత్రం అడ్డం రాకండని చెప్పుకుంటున్నారు.. అందుకు తగ్గట్టుగా వారికేమిస్తున్నారో తెలియదు మరి. కాని కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవేవీ రాని పరిస్ధితి. గట్టిగా అడగలేని పరిస్ధితి కూడా ఉంది. మొన్నటివరకు బిజెపితో రాజకీయంగా ఫైట్ చేసి గెలవాలనుకున్న చంద్రబాబు.. ఓడిపోయేసరికి సీన్ మార్చేసి.. ఇప్పుడు ఒక్క మాట కూడ మాట్లాడటం లేదు.
ఇప్పుడు లేటెస్టుగా.. వైసీపీవారు ప్రతి విషయంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్.. ఫైబర్ నెట్ లో అవినీతి ఇలా రకరకాల కేసులన్నీ సీబీఐ విచారించాలని.. లోక్ సభలో వైసీపీ ఎంపీలు ప్రస్తావించారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో వీటిపై మాట్లాడి తమ డిమాండ్ వినిపించారు. ఖచ్చితంగా సీబీఐ విచారణ చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అదే జరిగితే.. రాజకీయంగా బిజెపి.. ఇక ఏపీని మామూలుగా ఆడుకుంటుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే నోరెత్తడానికి భయపడుతున్న టీడీపీ నేతలు.. ఇక ఆ కేసులు సీబీఐ పరిధిలోకి వెళితే.. ఇక వణుకుతూ ఉంటారు. వైసీపీ ఎటూ బిజెపిని ఏమీ అడలేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ.. బిజెపికి దాసోహం అయితే.. ఇక ఏపీకి రావాల్సినవేమీ రావు. సోమువీర్రాజు చెప్పినట్లు.. బిజెపికి అధికారమిస్తేనే రాజధాని.. అధికారమిస్తేనే ప్యాకేజి. ఆ పరిస్ధితి వచ్చేవరకు .. దేవుడో కమలనాథుడా అంటూ ఏపీ ప్రజలు దిక్కులు చూడాల్సిందే.
రాజకీయ పరిణామాలన్నీ ఇలాంటి పరిస్ధితి వైపు పరుగులు పెడుతున్నాయి. రెండు ప్రధాన పార్టీలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడంతో… బలమైన ఆ రెండు పార్టీలు.. బిజెపి మాట వినాల్సిన పరిస్ధితి దాదాపు వచ్చేసింది. ఇక ఇలాంటి నేపథ్యంలో… కేంద్రం నుంచి వారు దయతో ఇస్తే తీసుకుని దండం పెట్టాలి తప్ప.. మాకిది రావాలి.. అది రావాలని డిమాండ్ చేసే స్టేజ్ అయితే ఇక ఉండదు. బిజెపి చరిత్ర చూస్తే.. ఏ కేసు వచ్చినా.. దానిని రాజకీయాలకు వాడుకున్నదే ఎక్కువగా కనపడుతున్నది. ఏ రాష్ట్రమైనా.. ఏ పార్టీ అయినా సరే.. తమకు అనుకూలంగా ఉన్నవారైతే.. ఒక రకంగాను.. ప్రతికూలంగా ఉంటే మరో రకంగాను వ్యవహరించడం దానికి అలవాటే. ఏకంగా సీబీఐ డైరెక్టర్లనే రాత్రికి రాత్రి మార్చేసిన రికార్డు కూడా వారి సొంతం. అందుకే ఇప్పటికే ఉన్న సీబీఐ కేసులు.. ఇకపై వచ్చే సీబీఐ కేసులు అన్నీ ఏపీని రాజకీయంగా గుప్పిట్లో పెట్టుకోవడానికి బిజెపికి కలిసొస్తుంది.
జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు కాకుండా.. కొత్తగా వివేకానందరెడ్డి హత్య కేసు కూడా వైసీపీకి సంకటంగానే మారింది. అలాగే కోడి కత్తి కేసు ఎన్ఐఏ చేతిలోనే ఉంది. ఇలా వైసీపీ ఆల్రెడీ చిక్కుకుని ఉంది. ఇక టీడీపీ ఇప్పుడు అమరావతి భూములు, ఫైబర్ నెట్ ఈ రెండు కేసుల చాలు.. చంద్రబాబు, లోకేష్ లు బిజెపి కాళ్లు పట్టుకోవడానికి. వైసీపీ డిమాండ్ చేసినట్లు సీబీఐ విచారణకు అంగీకరించడానికి బిజెపి ఉత్సాహంగానే ముందుకొస్తుందనడంలో సందేహం లేదు.