కేసీఆర్ ఆశలు గాలిలో మేడల మాదిరిగా కూలిపోవడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్. వికారాబాద్ జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు.
చాలామంది టీఆర్‌ఎస్ నేతలు ఎప్పుడెప్పుడు పార్టీని వీడేద్దామా? అని చూస్తున్నారన్నారు తరుణ్ చుగ్. ఏ గ్రామానికి వెళ్లినా ఇదో దొంగ ప్రభుత్వమనే చెబుతున్నారని సెటైర్లు వేశారు. రైతులు, యువకులు, మహిళలు, దళితులు అందరూ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబంలో ఒక్కో విభాగానికి ఒక్కో ముఖ్యమంత్రి ఉన్నారని.. వారంతా దోచుకునేందుకు ఆలోచనలు చేస్తుంటారని ఎద్దేవ చేశారు తరుణ్ చుగ్. కేసీఆర్ మంత్రివర్గంలో 420 లే ఉన్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ సునామీ పక్కా అని.. దాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యయుతంగా కుటుంబ అవినీతి పాలనను అంతమొందించేందుకు బీజేపీ కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు తరుణ్ చుగ్. ప్రతీ తలుపు తట్టాలని సూచించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం అన్నీ దక్కాయని.. ఈ విషయాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లాలని తెలిపారు తరుణ్ చుగ్.