తన సోదరుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ .. ప్రధాని మోడీ, ఆయన సహచరులు నెహ్రూ కుటుంబాన్ని ఎన్నోసార్లు అవమానపరిచారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ఆమె’ అమరవీరుని కుమారునిగా’ అభివర్ణిస్తూ.. బీజేపీ ప్రతిరోజూ ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ వచ్చిందని, ఆయనను దేశద్రోహిగా దుయ్యబట్టిందని, ‘మీర్ జాఫర్’ గా పోల్చిందని ఆమె అన్నారు. ‘మీరు రాహుల్ తల్లిని అవమానపరిచారు. రాహుల్ కి తన తల్లి ఎవరో తెలియదని మీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నా కుటుంబాన్ని రోజూ అవమానపర్చడమే పనిగా పెట్టుకున్నారు .. కానీ మీపై ఏ నాడూ కేసులు నమోదు కాలేదు’ అని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
ఈ కుటుంబం నెహ్రూ పేరును ఎందుకు వినియోగించుకోదని ఈ ప్రధాని పార్లమెంట్ నిండు సభలో పేర్కొన్నారని, కాశ్మీరీ పండిట్ల కుటుంబాన్ని మొత్తం ఆయన అవమానపరిచారని ఆమె విమర్శించారు. తన తండ్రి తరువాత తన కుటుంబ పేరును ముందుకు తీసుకువెళ్తున్న ఓ కుమారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు.
ఇక పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే.. మోడీ సామాజికవర్గాన్ని రాహుల్ కించపరిచారన్న బీజేపీ ఆరోపణను ప్రస్తావిస్తూ .. నీరవ్ మోడీ ఓబీసీయా.. మెహుల్ చోక్సీ ఓబీసీయా అని ప్రశ్నించారు. అలాగే లలిత్ మోడీ కూడా ఓబీసీయా అన్నారు. బ్లాక్ మనీతో దేశం వదిలిపారిపోతున్న ఆర్ధిక నేరగాళ్ళను ఉద్దేశించి మాత్రమే రాహుల్ వ్యాఖ్యానించారని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి సత్యాగ్రహాలు, నిరసనలు కొనసాగిస్తామని, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు పోరాడతామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ కి సంఘీభావంగా అన్ని విపక్షాలు కలిసివస్తున్నందుకు వాటికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన సత్యాగ్రహంలో పి.చిదంబరం, జైరాంరమేష్, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, అజయ్ మాకెన్, అధిర్ రంజన్ చౌదరి వంటి పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.