ఏపీలో పొత్తులపై అప్పుడే చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన కలిసి నడవాలని భావిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో టీడీపీ పొత్తు విషయంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో జనసేన స్టాండ్ ఒకలా ఉంటే.. బీజేపీ స్టెప్ మరోలా కనిపిస్తోంది.
ఈ సమయంలో పొత్తుల విషయంలో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాం..టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం పై ఆలోచిస్తున్నాం అన్నారు.
ఇక,జనసేనతోనే బీజేపీ పొత్తులో ఉంది. జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు సోము వీర్రాజు. ఇక ముందు నుంచి చెబుతున్నాం..కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకం అన్నారు సోమువీర్రాజు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారమిస్తే ఐదేళ్లలో రాజధాని కట్టి చూపిస్తాని హామీ ఇచ్చారు.
ఇప్పటికే అమరావతి రాజధాని కోసం నిధులు ఇచ్చాం.. రుణాలు ఇప్పించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోనే ప్రజల్లోకి వెళ్తామని.. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. విశాఖను అభవృద్ధి చేశాం.. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.