కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకి ఓ కొత్త పార్టీ షాకిచ్చింది. ‘తిప్రా మోథా’ అనే ఈ చిన్న పార్టీ అధ్యక్షుడైన మాజీ రాచరిక వంశ పాలకుడు ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మ.. అప్పుడే బీజేపీకి సవాలుగా మారారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో అమిత్ షా ఇక్కడ నిర్వహించిన ప్రచారంలో ఈ కొత్తపార్టీపై విమర్శలు గుప్పించారు. ఇది సీపీఎం తోను, కాంగ్రెస్ పార్టీతోనూ చేతులు కలుపుతోందని, ఇటీవలివరకు కాంగ్రెస్, కమ్యూనిస్టులే పోరాడుతుంటే ఇప్పుడు ఈ పార్టీ కూడా వీటితో కలిసిందని ఆయన ఆరోపించారు.
నిన్న శాంతిబజార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. కమ్యూనిస్టుల ట్రాప్ లో ఆదివాసీలు పడరాదని, మీ అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వమే మీకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. త్రిపురలో బీజేపీని ఎదుర్కొనేందుకు లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నాయి. అయితే ఇందులో తిప్రా మోథా మాత్రం ఈ కూటమికి దూరంగా ఉంది.
తమ పార్టీ ఎవరికీ తలవంచబోదని, ఏ పార్టీకీ బీ-టీమ్ కాబోదని ప్రద్యోత్ కిషోర్ ప్రకటించారు. తన తాత మహారాజా వీర్ విక్రమ్ మాదిరే తాను కూడా తమ ప్రజలను ఎవరికీ తలవంచేలా చేయబోమన్నారు. నిజానికి బీజేపీ ..నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు బీ టీమ్ అని, చివరకు మిజోరాంలో కూడా మీ పార్టీది ఇదే పరిస్థితి అని, తమిళనాడులో అన్నా డీఎంకే కి, పంజాబ్ లో అకాలీదళ్ కి, ఇంకా దేశంలో ఎన్నో పార్టీలకు మీది బీ టీమ్ అని అని ఆయన ఎద్దేవా చేశారు.
మాది చిన్న పార్టీ అయినా ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదన్నారు. ఈ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో మా పార్టీ బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలను ఓడిస్తుందన్నారు. 2021 లో జరిగిన గిరిజన ప్రాంత డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల్లో తిప్రా మోథా .. 30 సీట్లకు గాను 18 సీట్లను గెలుచుకుంది. గిరిజన ప్రాబల్యం గల 20 నియోజకవర్గాల్లో ఈ పార్టీకి పట్టుంది.