ఎక్కడో ఉండి ఊకదంపుడు మాటలు మాట్లాడటం కాదు.. బీజేపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే హైదరాబాద్‌లో చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. రైతులను రెచ్చగొట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనుల్లో.. పదో వంతు కూడా మేలు చేయలేదని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు నూకలు తినాలి అన్న బీజేపీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా పీయూష్ గోయల్ మాటలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి స్థాయిలో ఆయన మాటలు లేవని విమర్శించారు.
కేసీఆర్ కొన్నా.. కొనకున్నా మేమే వడ్లు కొంటామని గతంలో బీజేపీ నేతలు చెప్పారని.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొనాలని బండి సంజయ్ లేఖ రాశారని అన్నారు. వరి పంట వేయవద్దని కేసీఆర్ చెప్పినప్పటికీ.. రైతులను రెచ్చగొట్టి వరి పంట వేయించి.. రైతుల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు.
రైతుల కోసం టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చే ఏ ఒక్క పథకానికి కూడా కేంద్రం ఊసమంతైనా సహకారం అందించలేదని అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చి.. సాగునీళ్లు, పెట్టుబడి సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని కొనియాడారు ఎర్రబెల్లి.