బీజేపీలో అంతా చదువు రాని నిరక్షరాస్యులేనని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైరయ్యారు. ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఆ పార్టీలో అందరూ చదువుకోని వారేనని ఆరోపించారు. ఇటీవలే ప్రధాని మోడీని ఉద్దేశించి ..ఈ దేశానికి చదువు వచ్చిన ప్రధాని ఉండాలని వ్యాఖ్యానించిన ఆయన.. మళ్ళీ తన వ్యంగ్యాస్త్రాలను బీజేపీపై సంధించారు. బడ్జెట్ ను కేంద్రం ఆలస్యంగా ఆమోదించడాన్ని ప్రస్తావిస్తూ.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. సకాలంలో ఎందుకు ఆమోద ముద్ర వేయలేదని ప్రశ్నించారు.
ఇప్పటివరకు కేంద్రం లోని ప్రభుత్వమేదీ సంప్రదాయాన్ని అతిక్రమించలేదని, ఏ రాష్ట్రంలోనూ బడ్జెట్ ప్రక్రియను అడ్డుకోలేదని ఆయన చెప్పారు. కేంద్రం మొదట వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేజ్రీవాల్ గుర్తు చేస్తూ బడ్జెట్ లో 20 వేల కోట్లు మౌలిక సదుపాయాలకు, 500 కోట్లను యాడ్ లకు కేటాయించామని వివరించారు. 20 వేల కోట్ల కన్నా 500 కోట్లు ఎక్కువ అన్నదాన్ని తాము విననేలేదన్నారు.
బీజేపీలో చదువు రాని నిరక్షరాస్యులు ఢిల్లీ బడ్జెట్ గురించి బొబ్బలు చరుస్తున్నారని.. ఈ బడ్జెట్ ను చదివి దీని ప్రాధాన్యతను హైలైట్ చేయగల విద్యావంతులను ఆ పార్టీ ‘అద్దె’కు తీసుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు కేంద్రం ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటుందని ఆలోచించలేదన్నారు.
ఇప్పుడు రాజ్యాంగంపై దాడి జరిగిందని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా మూడు రోజులుగా బడ్జెట్ ఫైల్ పైనే కూర్చున్నారని ఆయన ఆరోపించారు. ఆయనకు మాటిమాటికీ ఫోన్ చేసిన తరువాతే బడ్జెట్ ఫైల్ అందిందని తెలిపారు. మొహల్లా క్లినిక్ లను ఏర్పాటు చేసేందుకు నిధులను కేంద్రం విడుదల చేయకుండా ఆపివేస్తోందని కూడా అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు.