ఆయన ముందు విప్లవం అన్నాడు. రోడ్డంతా గుంతలు.. అసలే చీకటి అన్నాడు. చేగువేరా బొమ్మలు చూపించాడు. ఈయన కూడా ఎర్రసోదరుడే అని లెఫ్ట్ పార్టీలు రైట్ రైట్ అన్నాయి. వారి కంటే ఘాటుగా ప్రసంగాలు చేశాడు. పర్యావరణం అన్నాడు.. అడువులన్నాడు.. గిరిజనులన్నాడు.. దీంతో కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా చప్పట్లు కొట్టారు. చివరికి వామపక్షాలతోనే పొత్తు పెట్టుకున్నారు. కాని అసలు పొత్తు చంద్రబాబుతోనే అనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికలు అయిపోయాయి.. ఫలితాలు దీపం ఆర్పేశాయి అనుకున్నారంతా. కాని తన లాంతరుతో పవన్ కల్యాణ్ కొత్త దారి వెతుక్కున్నట్లు కనపడుతోంది. పవన్ పై ఎంతమంది ఎన్ని చెప్పినా నమ్మని కామ్రేడ్లు.. విశాఖ లాంగ్ మార్చ్ కు బిజెపిని జనసేనాని ఆహ్వానించడంతో.. అనుమానం మొదలైంది. అయితే మేము రాము అని అలిగారు.. కాని బాస్ డోంట్ కేర్ అనుకున్నాడు.
లాంగ్ మార్చ్ సక్సెస్ అయింది. అక్కడి స్పీచ్ లో కూడా మాట వినకపోతే ఢిల్లీలో కంప్లయింట్ చేస్తానని జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. అనుమానాలు పెరిగాయి. అందరికీ అమెరికాలో రాంమాధవ్ తో జరిగిన సమావేశం గుర్తొచ్చింది.
నిజంగానే తర్వాత ఢిల్లీకి వెళ్లి రెండురోజులు ఉన్నారు. ఎవరిని కలిశారో తెలియదు.. ఏం చెప్పారో తెలియదు. మళ్లీ వెనక్కి వచ్చి.. కొత్త వ్యూహాలు మొదలెట్టారు. ఢిల్లీలో పవన్ కల్యాణ్ కలిసింది రాంమాధవ్ నే అని తెలుస్తోంది. ఆయన పవన్ కు దిశానిర్దేశం చేశారని.. ఏ అంశాలు హైలెట్ చేయాలో.. ఏం మాట్లాడాలో చెప్పారని సమాచారం. పవన్ కల్యాణ్ ఇప్పుడు కమలం వదిలిన బాణం అనే చర్చ మొదలైంది. కమలంతో కరచాలనం చేస్తే చాలు.. వారిని ముట్టుకోవడానికి కూడా వైసీపీకి భయమే కదా. వ్యక్తిగతంగా తీవ్రదాడి చేసిన వైసీపీ నేతలంతా ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు.
సంస్కతి, సంప్రదాయాలు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. మన బడి – మన నది అంటూ కొత్త కాన్పెప్ట్ మొదలెట్టాడు. దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా కోరాడు. గంగానది శుద్ది గురించి అంతకు ముందే పది రోజులు యూపీలో ఉండి వచ్చిన జనసేనాని.. ఆ రూటులోనే కదులుతున్నాడు. ఇంగ్లీషు మీడియం గురించి జనం స్పందన చూసి కాస్త వెనక్కు తగ్గిన చంద్రబాబును చూసి కూడా.. పవన్ ఆగటం లేదు. మాతృభాషను చంపేస్తున్నారంటూ ట్వీట్లు మొదలెట్టారు.
ఇప్పుడు హిందూ దేవాలయాలు ట్యాక్సు ఎందుకు కట్టాలని చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ వేసిన ప్రశ్నలను ట్వీట్ చేసి.. నాది కూడా ఇదే ప్రశ్న అన్నట్లు పెట్టారు. అందులో చర్చిలు, మసీదులు పన్ను ఎందుకు కట్టవు.. హిందూ దేవాలయాలు మాత్రం ఎందుకు కట్టాలనే అంశం ఉంది. ఇది ఎప్పటి నుంచో బిజెపి చేస్తున్న డిమాండ్. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని.. వాటిని స్వతంత్రంగా నడిపేలా అవకాశం ఇవ్వాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానికనుగుణంగానే పవన్ కల్యాణ్ ట్వీట్లు కనపడుతున్నాయి. అంటే ఇక పవన్ కల్యాణ్ దారి కమలం దారేనని అనుమానం బలపడుతోంది. అదే నిజమైతే.. వైసీపీకి టెన్షన్ తప్పదు.