భారతీయ జనతా పార్టీ పవిత్రమైన గంగానది వంటిదని, ఇందులో చేరి మీ ‘పాపాలను పోగొట్టుకోవాలని’త్రిపుర సీఎం మాణిక్ సాహా .. లెఫ్ట్ నేతలకు సలహా ఇచ్చారు. గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని అంటారు.. అలాగే బీజేపీ కూడా ఈ నదిలాంటిదే.. ఇందులో చేరి మీరు చేసిన తప్పిదాలకు నిష్కృతి పొందండి అన్నారాయన. ఆదివారం దక్షిణ త్రిపుర లోని కక్రాబన్ లో జరిగిన ‘జన్ విశ్వాస్’ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ఈ ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
స్టాలిన్, లెనిన్ బోధించిన ఐడియాలజీని నమ్మే వారు బీజేపీలో చేరాలన్నారు ఈ ‘రైలు బోగీలు ఇంకా ఖాళీగానే ఉన్నాయని..ఇందులో మనందరం వెళ్లాల్సిన గమ్యానికి ప్రధాని మోడీ మనలను తీసుకువెళ్తారని ఆయన చెప్పారు. విపక్ష సీపీఎంపై ఆరోపణలు గుప్పిస్తూ.. కమ్యూనిస్టుల హయాంలో ప్రజాస్వామ్యమంటూ లేదని, వారికి హింస, టెర్రర్ విధానాలు మాత్రమే తెలుసునని అన్నారు.
వామపక్ష ప్రభుత్య హయాంలో 69 మంది ప్రతిపక్ష నేతలు హతులయ్యారని, ఈ కక్రాబన్ లోనూ ఎన్నో రాజకీయ హత్యలు జరిగాయని మాణిక్ సాహా తెలిపారు. త్రిపురలో జన్ విశ్వాస్ పేరిట ర్యాలీలను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ నెల 5 న ప్రారంభించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరుసగా కొన్ని రోజులపాటు వీటిని నిర్వహించనున్నారు.
60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి మార్చి లోగా ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇక్కడ బీజేపీ, ఇండైజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పొత్తు పెట్టుకోగా విపక్ష సీపీఐ-ఎం.. అప్పుడే అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, బహిరంగ సభలను ప్రారంభించింది. బీజేపీ వైఫల్యాలను తాము ప్రతి ర్యాలీలోను, సభలోను ఎండగడతామని ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి తెలిపారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారన్నారు.