2002 గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని రూపొందించిన బీబీసీని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీబీసీ వాస్తవాల్ని చూపించిందని తెలిపారు. మనది ప్రజాస్వామ్యమా? లేక డిక్టేటర్ దేశమా? అని ప్రశ్నించారు. బీజేపీ చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు.
కాగా పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం విషయంలో మరోసారి వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్లుగా అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం చేస్తున్నామని, అయినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. జై భీమ్ నాయకులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కూల్చి వేయడంతో పాటు తాను తీసుకొచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించారు. ఎన్ని పోరాటాలు చేసినా తమ విగ్రహం ఇవ్వడం లేదని మండిపడ్డారు వీ హనుమంతరావు.
అయితే ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్.. భారత్ తో పాటు బ్రిటన్ లోనూ వివాదాస్పదం అయింది. ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత ప్రభుత్వం దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది.
ఈ డాక్యుమెంట్ నేపథ్యంలో బీబీసీని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం.. నిషేధాన్ని తిరస్కరించింది. ఒక డాక్యుమెంటరీ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందని ప్రశ్నించింది.