రాజ్యాంగం మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటోంది. రాష్ట్రవ్యాప్తంగా భీమ్ దీక్ష చేపట్టింది. సీఎం క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేశారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
కేసీఆర్ అహంకారంతో గర్వం తలకెక్కి మాట్లాడుతున్నారని ఆరోపించారు బండి. దేశమంతా ఆయన్ను చూస్తోందని మండిపడ్డారు. దేశంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్న కేసీఆర్… గడీలు నిర్మించుకొని, తానే రారాజు అని భావిస్తున్నారని మండిపడ్డారు.
అంబేద్కర్ రాజ్యాంగం వద్దు.. కల్వకుంట్ల రాజ్యాంగమే ముద్దు అని కేసీఆర్ చెబుతున్నారని విమర్శలు చేశారు సంజయ్. అహంకారంతో బరితెగించి మాట్లాడుతూ సమర్ధించుకోవడం సిగ్గుచేటని ఎద్దేవ చేశారు. కేసీఆర్ కు సీఎం పదవి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్షేనన్నారు. అంతేకాదు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చాలనుకున్న ఇందిరాగాంధీకే దేశ ప్రజలు చుక్కలు చూపించారని గుర్తు చేశారు.
ఇటు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు భీమ్ దీక్ష చేపట్టారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్నారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.