తిరుపతి : టీటీడీ పాలక మండలిపై సెగలు ఆగలేదు. తాజాగా రాయలసీమ పోరాట సమితి బీజేపీతో కలిసి ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో అవకాశం ఇవ్వడం, వివాదాస్పద వ్యక్తులకు పవిత్రమైన స్థానంలో కూర్చోబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఏపీతో సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు, వ్యాపారవేత్తలకు పెద్దపీట వేయడం, ఎన్ని అభ్యంతరాలు వస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం బీజేపీలో మంట పుట్టిస్తోంది. దీనిపై తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతో రంగంలో దిగిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి తాజాగా జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘టీటీడీ అంటే తెలంగాణ, తిరుపతి దేవస్థానమా?’ అంటూ ప్రభుత్వానికి సూటి ప్రశ్న సంధించారు. కొత్తగా వేసిన టీటీడీ బోర్డు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీటీడీలో కళంకితులకు చోటు కల్పించారంటూ ఇటు బీజేపీ తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తోంది. బీజేపీ-రాయలసీమ పోరాట సమితి సంయుక్తంగా పోరాటం చేయాలని నిర్ణయించాయి.