కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టాలను నిరసిస్తూ ఉత్తరాది రైతులు చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతుంది. ఢిల్లీకి వచ్చే దారులన్నీ దిగ్బంధం చేస్తామని రైతు సంఘం నేతలు హెచ్చరించిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆదివారం అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, వ్యవసాయ మంత్రి తోమర్ సమావేశమయ్యారు.
ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఉద్యమిస్తుండటం, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. పంజాబ్, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు తరలి వస్తున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద రైతుల సభకు అనుమతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.