మునుగోడులో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. మునుగోడు క్యాంపు కార్యాలయం నుంచి బీజేపీ శ్రేణులతో కలిసి ఇడికుడ, బంగారిగడ్డ మీదుగా.. చండూర్ ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లారు రాజగోపాల్.
భారీ ర్యాలీ అనంతరం నామినేషన్ వేశారు. కోమటిరెడ్డి వెంట తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు సహా పలువురు నేతలు ఉన్నారు. మునుగోడులో గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహించుకుంటూ గెలుపు వ్యూహాలపై చర్చలు జరుపుతోంది.
పార్టీ అగ్రనేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ మండల ఇంఛార్జులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారం ముగిసేవరకు ఇంఛార్జులు నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఇప్పటికే బండి సంజయ్ ఆదేశించారు. ఈ సెమీ ఫైనల్ ఫైట్ లో గెలిస్తేనే అసలు ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని బీజేపీ నమ్ముతోంది. అందుకే ఏ అవకాశాన్నీ వదలకుండా ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంది.
మరోవైపు నామినేషన్ సందర్భంగా మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.ఆధారాలు వుంటే మీడియా ముందుకు రావాలన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలిస్తున్న కేసీఆర్ దిగి రావాలంటే ఉపఎన్నిక రావాలని నమ్మానని చెప్పారు. అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని రాజీనామా చేసినట్లు తెలిపారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికలతో బీజేపీ బలం పెరిగిందని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి.