కృష్ణసాగర్ బీజేపీ అధికార ప్రతినిధి
సోనియా గాంధీ , రాహుల్ గాంధీ లు దేశం తిరిగి వచ్చేసరికి, వారు విదేశాలకు వెళ్లినప్పుడు ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉండకపోవచ్చు. బహుశా వాళ్లు వచ్చే నాటికి,కాంగ్రెస్ పార్టీ రూపు రేఖలు చూసి వారు ఆశ్చర్యపోవచ్చు.
కాంగ్రెస్ పార్టీలో నిట్టనిలువుగా చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. అతి సీనియర్ నాయకులే అధిష్టానానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరగబడ్తున్నారు. కుప్పకూలిపోయే ఈ జాతీయ పార్టీని వదలిపెట్టి వారి దారి వారు చూసుకోవడానికి అనేక రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు దేశం ఆరోగ్యం, కోవిడ్ వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలు, చైనా సరిహద్దు వివాదం వంటి సమస్యల్లో తలమునకలై ఉన్న వేళ, ప్రధాన ప్రతిపక్ష నాయకురాలైన సోనియా గాంధీ గారు పార్లమెంటులో ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం లేదా? ఒకవేళ సోనియా ఆరోగ్య కారణాలతో అమెరికా వెళితే, ఇదే సమయంలో రాహుల్ అక్కడేం చేస్తున్నారు?
అసలు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో తన కర్తవ్యాన్ని బాధ్యతలను గుర్తిస్తుందా..? ఇటువంటి సంక్లిష్ట సమయంలో ప్రధాన ప్రతిపక్ష సీనియర్ నాయకులు, సీన్ లో నుంచి తప్పుకోవడంతో దేశంలోని ప్రజలు కాంగ్రెస్ బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా గుర్తిస్తున్నారు. అసలు ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఒక ప్రధాన ప్రతిపక్షం ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా ఉంటుందా..? అసలు కాంగ్రెస్ ఒక జాతీయ ప్రత్యామ్నాయ శక్తిగా కొనసాగగలిగే లక్షణాలు ఉన్నాయా..?జాతీయ రాజకీయ ముఖ చిత్రంలో కాంగ్రెస్ పాత్ర ఇంకా ఏమైనా మిగిలి ఉందా? అసలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యధాతథంగా రాజకీయ క్షేత్రంలో ఉంటుందా?