సీఎం కేసీఆర్ అండ చూసుకునే మజ్లిస్ నేతలు దాడులకు తెగబడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మజ్లిస్ను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. మలక్ పేటకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు ఎంఐఎం నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్, ఎంఐఎం మైత్రి విడదీయరానిదని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని అన్నారు.
కానీ సీఎం కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఇక్కడి టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎంఐఎం నేతలంటే భయమన్నారు. అందుకే వాళ్లు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారని విమర్శించారు.
కేసీఆర్‌కు దమ్ముంటే పాత బస్తీలో పన్నులు వసూలు చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఎంఐఎంను ఎదుర్కొనే దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. మజ్లిస్ ఆగడాలను ఏమాత్రం సహించేది లేదన్నారు. చిట్ చాట్ అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై కేటీఆర్ చవకబారు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు.