వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఒక్కశాతం ఉన్నట్టు రుజువైనా పులివెందుల నడిబొడ్డున ఉరివేయమని కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. వై.ఎస్.కుటుంబం తనపై కక్షగట్టి వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. కడప జిల్లాలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి ఈరోజు లేదా రేపు 10 గంటలకు విచారణకు హాజరుకమ్మని జమ్మలమడుగు డీఎస్పీ కోరారని…డిసెంబర్ ఆరో తేదీన విచారణకు హాజరైన వారికి 61 ఎ కింద, తనకు మాత్రం 161 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఆరో తేదీన తాను ఢిల్లీలో ఉండడం వల్ల విచారణకు హాజరుకాలేకపోయానని చెప్పారు. తనను జాగ్రత్తగా ఉండాలని ఎంతో మంది హెచ్చరించారని చెప్పారు.తన తప్పుంటే ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని వెల్లడించారు.
తాను అజ్ఞాతంలో ఉన్నానంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని…తాను కనిపించకుండా దాక్కోడానికి చీమను కాను, మనిషిని అన్నారు. మీడియా తప్పుడు కథనాలతో తన కుటుంబం మనో వేదనకు గురైందన్నారు. ఇష్టం వచ్చినట్టు టీవీలో నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడం తగదన్నారు. మీడియా అజ్ఞానాన్ని విడనాడాలని కోరారు.
వై.ఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో వారి అంతరాత్మకే తెలుసునని…టీడీపీ హయాంలో సిట్ వద్దు సీబీఐ దర్యాప్తు కావాలని అడిగిన వారే ఈరోజు సిట్ కావాలని అడగడం వెనుక ఆంత్యర్యమేమిటని ప్రశ్నించారు. సిట్ పైన ఎవరికి అవగాహన లేదని..వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు.