బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు శనివారం హాజరయ్యారు. కవితపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ వివరణ ఇచ్చారు. రెండు పేజీల వివరణ లేఖ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ తన వివరణలో కవితను ఉద్దేశించి మాట్లాడిన మాటలను సమర్థించుకున్నారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే తాను మాట్లాడినట్లు సమాధానం ఇచ్చారు. తెలంగాణ కుటుంబ సభ్యులు ఉపయోగించే భాషనే ఉపయోగించినట్లు బండి సంజయ్ చెప్పారు.
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసింది. 15న విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో శనివారం హాజరవుతానని చెప్పారు బండి.
మరోవైపు ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు మహిళా కమిషన్ ఆఫీసు ఎదుట నిరసనకు దిగాయి. ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులు సర్దిచెప్పి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి సంజయ్ సమాధానం పట్ల మహిళా కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇంకా విచారణ కొనసాగుతోంది.