బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కోరుట్ల నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతికే మీటర్లు పెట్టామన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. మోటార్లకు మీటర్లు పెడితే.. తానే బాధ్యత వహిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. లేని పక్షంలో సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.
రూ.60 వేల కోట్ల బకాయిలతో డిస్కంలను సంక్షోభంలోకి నెట్టిన సీఎం.. కరెంట్ ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారన్నారు. మేకిన్ ఇండియా పేరుతో స్థానిక పరిశ్రమల నుండే చైనా బజార్లకు వస్తువులు వెళ్తున్నాయన్నారు. వేములవాడ రాజన్న, బాసర సరస్వతి ఆలయాలకు వందల కోట్ల మంజూరు హామీ ఏమైందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.
మళ్లీ కొండగట్టు అంజన్న పేరుతో దేవుళ్లకే శఠగొపం పెడతున్నారని ఆరోపించారు. బీడీ కార్మికుల బాధలెందుకు పట్టించుకోవడం లేదన్నారు. పెన్షన్లకు కటాఫ్ డేట్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివే అని బండి సంజయ్ చెప్పారు.
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే ఉరేసుకుంటానన్న ఎమ్మెల్యే ఎటుపోయిండని ప్రశ్నించారు బండి సంజయ్. రూ.250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు డబ్బులివ్వరా అని అడిగారు. లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తారా? అని మండిపడ్డారు. కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్.