‘కంటి వెలుగు’ పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల కోసమే కేసీఆర్ ‘కంటి వెలుగు’ ప్రారంభించారన్నారు. అందుకే 18 ఏళ్లు దాటిన వారికే కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ హయాంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేకపోయినా.. వాడవాడలా బెల్టు షాపులు మాత్రం ఉన్నాయని సెటైర్లు వేశారు. సంక్షేమ పథకాలకు పైసల్లేవంటున్న సీఎం.. కవితకు దొంగ సారా తయారీకి రూ.100 కోట్ల పెట్టుబడి మాత్రం పెట్టాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలున్నాయంటూ విమర్శించారు.
కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలను.. మేమే ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పార్టీ ధనికుల పార్టీ అయితే బీజేపీ పేదల పార్టీ అని పేర్కొన్నారు. నాయకులను తయారు చేసేందుకే బీజేపీ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు బండి సంజయ్.