కేసీఆర్ పార్టీలో తెలంగాణ లేదని.. ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేయడానికి సొంత పార్టీ నేతలే సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ డబ్బులు పంపుతున్నాడని విమర్శించారు. ఫిబ్రవరిలో ప్రధాని మోడీని తెలంగాణకు ఆహ్వానించి బూత్ కమిటీ సమ్మేళనం నిర్వహిస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు.
బీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. 90 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. బీజేపీకి ప్రతి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులున్నారన్నారు.
బీజేపీకి అభ్యర్థులు లేరనేది ఒక వర్గం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తెలంగాణలో నాలుగంచెల వ్యూహంతో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్ హైదరాబాద్ రావటానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు బండి సంజయ్.