‘హాథ్ సే హాథ్’ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో డీ శ్రీనివాస్ చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్ చేరిక అధిష్టానం పరిధిలో ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పటికే రెండు సార్లు సోనియాను కలిశారని.. కొత్త చేరికలు త్వరలో ఉంటాయని తెలిపారు. నాయకులు అభ్యంతరం పెట్టినా చేరికలు ఆపొద్దని రాహుల్ గాంధీ చెప్పారని వివరించారు.
పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేర్చుకుంటామన్నారు. ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టామని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు రేవంత్. ఇక భట్టి యాత్ర ఏఐసీసీ కార్యక్రమం అని.. తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహత్మకంగా రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో బండి వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వెయ్యి కోట్ల నిధులు వచ్చాయని.. అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పడం లేదన్నారు. రూ. 100 కోట్ల కోసం రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నేతలు.. రూ.1000 కోట్ల నిధులపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగాయి. బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా బండి సంజయ్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు.