రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అరాచకాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం తాండూరులోని బీజేపీ నేత మురళీ గౌడ్ కుటుంబ సభ్యులను బండి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మురళీ గౌడ్ పై దుండగులు చేసిన దాడిని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ నేతలకు అధికారంతో కండకావరం ఎక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు చేస్తే ప్రత్యారోపణలు చేయాలి కానీ.. కుటుంబంపైకి వచ్చి దాడులు చేయడమేంటని ప్రశ్నించారు.
ఈ ఘటనపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడిపై పోలీసులకు ముందే సమాచారం ఉందన్నారు. ఆ దుండగులు పోలీసులను కూడా కొట్టారని, పోలీసులకు కూడా చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలన్నారు. పోలీసుల మీద జరిగిన దాడిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ దాడిపై సీఎం, డీజీపీ స్పందించి యాక్షన్ తీసుకోవాలని లేకుంటే మా లీగల్ టీమ్ తో న్యాయపోరాటం చేస్తామన్నారు.
రాష్ట్రంలో కుక్కలు చిన్న పిల్లల ప్రాణాలు తీస్తుంటే బీఆర్ఎస్ నేతలు మనుషుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కుక్కల దాడిలో బాలుడు చనిపోతే ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఫామ్ హౌజ్ లో కుక్కకు ఉన్న విలువ మనుషులకు లేదని విమర్శించారు.
అనంతరం బండి సంజయ్ దివంగత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలపై రియాక్ట్ అయ్యారు. సాయన్న అంత్యక్రియలను అధికారికంగా జరపకపోవడంపై ఫైర్ అయ్యారు. కేటీఆర్ ను సీఎం చేయాలన్న ప్రతిపాదనను సాయన్న వ్యతిరేకించారని అందుకే అంత్యక్రియలు అధికారికంగా జరపలేదన్నారు. నిజాం వారసుడికేమో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి.. పదవిలో ఉన్న ఎమ్మెల్యేని మాత్రం అవమానిస్తారా? అని నిలదీశారు. దళితుడు అనే కారణంతోనే సాయన్నను అవమానించారని దుయ్యబట్టారు బండి సంజయ్.