తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపణలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం మాజీ ఎంపీ భూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువ అయ్యాయన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు చేసే వాళ్ళు బీఆర్ఎస్, ఎంఐఎం వాల్లే అయివుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాకముందు ఆర్టీసి ఉద్యోగులు ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణలో.. ఆర్టీసి ఉద్యోగుల పరిస్థితి నేడు దుర్బరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టినా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
ఈ ఆరు నెలలుగా ముఖ్యమంత్రి ఎప్పుడూ అభివృద్దిపై మాట్లాడలేదని.. అభివృద్ధిపై ముఖ్యమంత్రిని చర్చకు రమ్మన్నా రావడం లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీరు రాకుండా కేసీఆర్, హరీష్ రావు సంతకాలు చేసి అన్యాయం చేశారని ఆరోపించారు.
కేంద్రం నుంచి వచ్చిన నిధులు డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు బండి సంజయ్.