ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోందని లేఖలో పేర్కొన్నారు బండి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటి వరకు సమగ్ర పంటల బీమా పథకాన్ని రూపొందించక పోవడం సిగ్గు చేటన్నారు.
పంటల బీమా పథకం రూపకల్పన విషయంలో మీ నిర్లక్ష్యంవల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి రైతులు నష్టోతూనే ఉన్నారని దుయ్యబట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తే రైతులకు పరిహారం అందే అవకాశముండేదని బండి సంజయ్ గుర్తు చేశారు.
బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో మీరు ఈ పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేయక పోవడం వల్ల ఏళ్ల తరబడి రైతులు నష్టపోతూనే ఉంటున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపునైనా సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయకుండా.. రైతుల నోట్లో మట్టికొడుతుండటం క్షమించరాని నేరమని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ యుద్ద ప్రాతిపదికన పరిహారం అందించాలన్నారు.
వ్యవసాయంలో అద్బుతాలు సృష్టించేందుకు రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందిస్తామని గతంలో మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి చెప్పారు. వచ్చే వానకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులందరికీ రైతు బంధుతో పాటు ఉచితంగా యూరియా, విత్తనాలను అందించాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.