బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మరోసారి కేసీఆర్ పై, కవితపై తీవ్ర విమర్శలు చేశారు. అది బీఆర్ఎస్ ఆవిర్భావ సభలా లేదని.. సంతాప సభలా ఉందంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఈ రోజు బీఆర్ఎస్ ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఒక్కరి ముఖంలో కూడా నవ్వు లేదన్నారు.
జాతీయ పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారు. కానీ నేషనల్ పార్టీకి సంబంధించిన విధివిధానాలే ప్రకటించలేదన్నారు. పార్టీ ప్రారంభించినప్పుడు ఏం చేస్తాడో ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటకీ.. ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ఇక్కడ ఏమీ పీకలేనోడు.. దేశ రాజకీయాల్లో ఏం పీకుతాడని.. ఆయనవన్నీ బూటకపు వాగ్దానాలేనని విమర్శించారు.
కేసీఆర్ బిడ్డ కవిత ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడే ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది. ఇప్పుడు జాతీయ పార్టీ చేస్తే.. అంతర్జాతీయ లిక్కర్ దందా చేస్తదేమో అంటూ ఎద్దేవా చేశారు. కవిత లిక్కర్ దందా పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రకటన అని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరకపోయోలా చేశారంటూ వ్యాఖ్యానించారు.
పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి తయారైందంటే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో చేరుకుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాషాయ జెండా కాంతిలో రంగురంగుల జెండాలు మాడిమసైపోతాయన్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ ప్రకటన తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. బెంగుళూరులో డిపాజిట్ రానివాళ్లను, దిక్కూ దివనా లేని తుక్డే గ్యాంగ్ ను పట్టుకొచ్చుకున్నారని విమర్శించారు బండి సంజయ్.