బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేశారు. కేసీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. పదునైన మాటలతో విమర్శలు చేస్తున్నారు బండి సంజయ్. తాజాగా బుధవారం బండి సంజయ్ మూడో రోజను పాదయాత్రను 5.8 కిలో మీటర్ల మేర సాగించారు. మంగళవారం రాత్రి గుండెగాం గ్రామంలో బస చేసిన ఆయన.. బుధవారం ఉదయం గ్రామ కూడలిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామ పెద్దలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పల్శీకర్ రంగారావు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో గుండెగాం గ్రామం ముంపునకు గురవుతుందని తెలిసినప్పటికీ అధికార యంత్రాగం చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబం ఒక్కటి చల్లగా ఉంటే చాలా అని నిలదీశారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామస్థులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. తేళ్లు, పాములతో సహవాసం చేయాల్సి వస్తుంది. మీ జీవితాల గురించి ముఖ్యమంత్రికి అవసరం లేదని.. ఆయన ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. నలుగురి ప్రాణాలు పోతే గానీ.. కేసీఆర్ సర్కార్ కళ్లు తెరవదు.
నేనే ఈ గ్రామానికి వస్తున్నానన్న సమాచారం తెలిసిన తర్వాతనే అధికార యంత్రాంగం ఇక్కడికి వచ్చి సర్వే పనులు చేసినట్టు నా దృష్టికి వచ్చిందన్నారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే.. గుండెగాం గ్రామానికి పునరావాసం ఏర్పాటు చేయిస్తానని అభయమిచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. ఇన్నేళ్లల్లో ఒక్కసారైనా ఇక్కడికి రాలే. ఇంకా వస్తాడన్న భరోసా కూడా లేదని ఎద్దేవా చేశారు బండి సంజయ్.