నయీం ఆస్తులు మొత్తం ముఖ్యమంత్రి కుటుంబమే అనుభవిస్తుందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం యాదాద్రి జిల్లా ఆలేరులో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ లో బండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవాలయాలమాటున కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీలు రావడం లేదు.. కమీషన్లు ఇస్తేనే పెట్టుబడులకు కేసీఆర్ అనుమతి ఇస్తున్నాడని పేర్కొన్నారు. రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినా రాష్ట్ర ప్రజలకు మంచినీటిని అందించని వైఫల్య ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2,40,000 ఇండ్లను కేంద్రం నిర్మించిందని అన్నారు. పక్క రాష్ట్రంలో 70,000 ఇళ్లు పూర్తిచేసి పంపిణీ చేసిందని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వలేని కేసీఆర్.. దేశమంతా ఎక్కడ నుండి ఇస్తాడని ప్రశ్నించారు.
రూ.60 వేల కోట్ల నష్టంలో డిస్కమ్ లు నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పీఎం కిసాన్ నిధి ద్వారా వచ్చిన పైసలను బ్యాంకర్లు ఫ్రీజింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. కుక్కలు మాంసం లేకనే మనషులను కరుస్తున్నాయని అనడం బీఆర్ఎస్ నాయకుల అవివేకమన్నారు బండి సంజయ్.