రామరాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించబోనని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బండి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఊరూరా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మం కోసం పని చేయడమే నాకు ముఖ్యమని, రాజకీయాల కోసం ధర్మాన్ని ఉపయోగించబోనని, ధర్మం కోసం రాజకీయాలు చేస్తానన్నారు.
కొందరు ఫాల్తుగాళ్లు హిందూ మతాన్ని కించపరిస్తే స్పందించకపోవడం అన్యాయమని, అయ్యప్పను, సరస్వతి అమ్మవార్లను కించపరిస్తే కనీసం నిరసన వ్యక్తం చేయకపోవడం బాధాకరమన్నారు. హిందూ మతం ఏ మతానికి వ్యతిరేకం కాదని, అయినా హిందూ ధర్మాన్ని కించపరచడం కొంతమందికి ఫ్యాషన్ గా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శివ లింగంపై మూత్రం పోయడానికి ప్రయత్నించిన మొగల్స్ ను తరమికొట్టిన యోధుడు శివాజీ అని ఆయన వ్యాఖ్యానించారు. కండువా ఏది కప్పుకున్న పర్వాలేదు కానీ కాషాయ జెండాకి, హిందూత్వానికి విలువలు ఇవ్వాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలని, దానికి కార్యకర్తలు, మండల నాయకుల కృషి తప్పని సరి ఉండాలని అన్నారు.
మీరు కష్టపడి ఎంపీగా నన్ను గెలిపించారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినయ్యా.. తెలంగాణలో రజాకార్ల రాజ్యాన్ని పొలిమేరలదాకా తరిమికొట్టి మీరు కలలు కన్న రామ రాజ్యాన్ని స్థాపించేదాకా విశ్రమించబోనని ప్రతిజ్ఞ చేస్తున్నానని పేర్కొన్నారు బండి సంజయ్.