తెలంగాణ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక రైతు బంధు పథకం పెట్టి.. పది పథకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందని ఎద్దేవా చేశారు. ఇది ‘రైతు బంధు కాదని.. భూమి బంధు’ అని పేర్కొన్నారు. 2014 భారతదేశం అప్పు కేవలం రెండితలు మాత్రం పెరిగితే.. తెలంగాణ అప్పు ఆరు రెట్లు పెరిగిందన్నారు. ‘కోటి ఓట్లు.. 90 సీట్లు ప్రగతి భవన్ లో స్లాట్’ ఇప్పుడిదే బీజేపీ నినాదమని వెల్లడించారు.
కేంద్రం అందిస్తోన్న రైతు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందనీయడం లేదని, రైతు రుణమాఫీ కూడా చేయడం లేదని ఆరోపించారు. ఆయిల్ ఫార్మ్ కు కేంద్రం సబ్సీడీ ఇస్తోందని, కానీ ఈ విషయాన్ని తెలంగాణ సర్కార్ రైతులకు చెప్పడం లేదని ఆగ్రహించారు. మూడు చెక్ డ్యామ్ లు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మోడీ గతి శక్తిని నమ్ముకుంటే.. కేసీఆర్ ఉచిత శక్తిని వాడుకుంటున్నారని విమర్శించారు. ఎంబీబీఎస్ సీట్ల ఫీజు తగ్గడానికి, ఎక్కువ రాంక్ వచ్చిన వారికి సీట్లు రావడానికి కేంద్రమే కారణమన్నారు.
ఇంతకుముందు కూడా ఉపాధి హామీ పథకం తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారిందని నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం రైతు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు కేసీఆర్ పేరు పెట్టడమేంటని ఆయన నిలదీశారు.
తెలంగాణ తల్లి పేరు మీద కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అడిక్షన్ నుంచి సర్పంచ్ లు, ఎంపీటీసీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులు పొందే అవకాశం కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు బూర నర్సయ్య గౌడ్.