కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రీతి మెడికల్ వెంటిలేటర్ పై లేదని, పొలిటికల్ వెంటిలేటర్ మీద ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతిని అపోలో హాస్పిటల్ కి షిఫ్ట్ చేయమంటే డెత్ డిక్లేర్ చేశారని ఆరోపించారు.
వెనుకబడిన వారిపై ఆరోపణలు ఉంటే వెంటనే ఎన్ కౌంటర్ అవుతారని.. కానీ అదే తమ వారైతే ప్రభుత్వం వారి తరపున పోరాడుతుందని విమర్శలు చేశారు. ప్రీతిది హత్యనా.. ఆత్మహత్యనా అన్న విషయాన్ని కూడా ప్రభుత్వం తేల్చుకోలేకపోతుందన్నారు. గతంలో తెలంగాణలో నడిరోడ్డుపై చంపడం చూశామని, పోలీసు వ్యవస్థను బీఆర్ఎస్ కు మరో విభాగంగా తయారు చేశారని మండిపడ్డారు.
మద్యం, మత్తు, మతమే నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఏం చేస్తున్నారు అని బూర నర్సయ్య ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనను అంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. పాలక్, విస్తరాకు అంటూ బీజేపీని అవమానించేలా మాట్లాడితే.. భవిష్యత్తులో మీరు వాటిపైనే తినాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మీద అభాండాలు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పిల్లలు పదో తరగతికి కూడా రాకముందే మద్యం తాగుతున్నారని, దాని వల్ల హాస్టల్స్ లో ఆకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎక్సైజ్ ప్రోహిబిషన్ శాఖ కాకుండా ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా పేరు మార్చుకోవాలని సెటైరికల్ కామెంట్స్ చేశారు బూర నర్సయ్య గౌడ్.