తెలంగాణ మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత సీఎం రమేష్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తండ్రి, కొడుకులకు కళ్లు, చెవులు లేవని కేవలం నోరు మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. కేసుల భయంతోనే తాను బీజేపీలో చేరానని.. బీజేపీలో చేరడంతో తనపై ఉన్న అభియోగాలు అన్నీ మాయం అయిపోయాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రమేష్ రియాక్ట్ అయ్యారు.
గతంలో కేసీఆర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇవే కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మీద ఒక్క సీబీఐ, ఈడీ కేసు లేదని.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేటీఆర్ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ, మోడీ విధానాలు నచ్చే తాను కాషాయ తీర్థం పుచ్చుకున్నానని చెప్పారు.
తనపై పదే పదే అవే రకమైన కామెంట్స్ చేస్తున్నారని.. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగోదని.. మీ గురించి అంతా తెలుసన్నారు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నుంచి నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా? అని నిలదీశారు.
మీ మీద ఉన్న అభియోగాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టుల మీద గౌరవం ఉంటే న్యాయపరంగా ఎదుర్కోవాలని కానీ ఇతరులపై ఆరోపణలు చేయడం తగదంటూ ఫైర్ అయ్యారు బీజేపీ నేత సీఎం రమేష్.