తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు, వారి కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప పేద ప్రజలు పేదలుగానే మిగిలారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. హన్వాడ మండలం గొంద్యాల గ్రామంలో మంగళవారం పల్లె గోస-బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పచ్చి అబద్దాల కోరని దుయ్యబట్టారు. దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చర్చకు రా అంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపైన కానీ, రైతు రుణమాఫీ పైన, నిరుద్యోగ భృతి పైన, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయాలపైన చర్చించకుండా కేవలం కేసీఆర్ భజన మండలి ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుటుంబాన్ని పొగడం కోసమే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ పసికందు.. అప్పుడే పుట్టిన బిడ్డ లాంటిది. తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని తెలంగాణ ప్రజల వద్దకు వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. కేవలం తనకు కమిషన్ వచ్చే కాంట్రాక్టు పనులను అంచనాలు పెంచి.. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్.. 8 ఏళ్లు గడిచినా పూర్తి చేయకుండా ప్రాజెక్టు అంచనాను పెంచారన్నారు.
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ ఒక్క కార్పొరేషన్ నిధులను పేద ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయలేదన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలు లేవు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలులేవు, ఎస్టీ కార్పొరేషన్ నిధులు లేవు, మైనార్టీ కార్పొరేషన్ రుణాలను బంద్ చేశారన్నారు. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు పెన్షన్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 50 రూపాయల పెన్షన్ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 2000కు పెంచడం మాత్రమే జరిగిందన్నారు. 9 ఏళ్ల కాలం గడుస్తున్న ఒక్క పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలేదని ఆమె విమర్శించారు.
రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే సంక్షేమంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని ఆమె పేర్కొన్నారు. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఐదు సార్లు బీజేపీ ప్రభుత్వం వరుసగా గెలవడం జరుగుతుందన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లోనూ రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు లేవన్నారు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. దేశం పట్ల దేశ ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషి వల్లే మళ్లీ మళ్లీ ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని ఆమె అన్నారు. రానున్న ఎన్నికల్లో మీ కోసం పని చేసే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, మాజీ మంత్రివర్యులు పీ చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.