తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని సెటైర్లు వేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం కూడా ఇవ్వలేని తెలంగాణ సీఎం.. దేశాన్ని పాలిస్తానంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఘాటు విమర్శలు చేశారు.
కేసీఆర్ మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశారు. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి.. దేషాన్ని ఉద్దరిస్తాడా? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చి ప్రసంగిస్తే హిందీలో మాట్లాడుతారని విమర్శించిన కేసీఆర్.. ఇప్పుడు వచ్చిన నాయకులంతా ఏ భాషలో మాట్లాడారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం కాదని, తెలంగాణ ప్రజలు గల్లీలో కూడా ఉండకుండా, తిరగకుండా చేయడం ఖాయమని ఆమె బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ పేరుతో వెలగపెట్టిందేమీ లేదని, బీఆర్ఎస్ పేరుతోనూ వెలగపెట్టేదేమీ ఉండబోదన్నారు.
ఏం మాట్లాడాలో అర్థంకాక సమయం అయిపోయిందా? హెలికాఫ్టర్ తో పెద్ద సమస్య అని ముఖ్యమంత్రి ప్రసంగం మధ్యలో అనడం కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకేనన్నారు. తెలంగాణకే ఉచిత విద్యుత్ దిక్కులేదని.. అలాంటిది కేసీఆర్ దేశమంతా ఉచిత విద్యుత్ ఇస్తాడా? అంటూ ధ్వజమెత్తారు డీకే అరుణ.