హైదరాబాద్: రోడ్లను మరమ్మతు చేసేందుకు కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. గద్వాల రోడ్లను, ఆర్‌వోబీని పరిశీలించడానికి వచ్చిన అరుణ.. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పడేసిందని ఆగ్రహం వెలిబుచ్చారు. ‘గద్వాల రోడ్లు గుంతలమయం అయ్యాయి. అరేళ్ల నుంచి ఆర్‌వోబీ నిర్మాణం పూర్తి కాలేదు. సర్వీస్ రోడ్డు మరమ్మతులు ఎప్పుడు చేస్తారో తెలియదు’ అంటూ అరుణ విమర్శించారు. ప్రభుత్వ పనితీరుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. గద్వాల పంచాయతీరాజ్ ఆఫీస్ ముందు రోడ్డ దుస్థితి చూసి అధికారులపై మండిపడ్డ డీకే అరుణ.. గుంతలమయంగా మారిన రోడ్లపై వరి నాట్లువేసి నిరసన తెలియజేశారు. గద్వాల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ చేతగానితనం వల్ల అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు.