రాహుల్ గాంధీ తప్పులు చేశారు కాబట్టే శిక్ష పడిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుందంటూ మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ ధ్వజమెత్తారు. మోడీ అనే పేరున్న వాళ్లంతా దొంగలేనని సంబోధిస్తారా? అని మండిపడ్డారు.
లండన్ వెళ్లి ప్రధాన మంత్రి మోడీ.. భారత దేశం పరువు, దేశ ప్రతిష్టను మంట కలిపారని అనడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు వెల్లడించారు డీకే అరుణ. దేశంలో అణగారిన వర్గాల ప్రజలపై ఉన్న కాంగ్రెస్ అహంకారానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిదర్శనమన్నారు.
దొంగల ఇంటి పేరు మోడీ అంటూ చేసిన వ్యాఖ్యల కారణంగానే రాహుల్ కి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీనికి బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించారు. కోర్టు తీర్పునకు, బీజేపీకి ముడి పెడుతూ కాంగ్రెస్ పార్టీ గొడవ చేయడం సరైన పద్దతి కాదన్నారు.
రాహుల్ ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని, వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు డీకే అరుణ.