కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో లేక పోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని ఆమె వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై ఆమె మాట్లాడుతూ… ప్రతి 40 కిలోల ధాన్యం బస్తాకు 3 కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులకు ప్రభుత్వం తీవ్రంగా నష్టం చేకూరుస్తోందని ఆమె పేర్కొన్నారు.
కేంద్రం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందన్నారు. తమ వంతుగా ఇవ్వాల్సిన నిధులను కూడా బీఆర్ఎస్ సర్కార్ కేటాయించడం లేదని ఆమె ధ్వజమెత్తారు.
రైతులకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తోందని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరే జెండా కాషాయ జెండానే అని ఆమె ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామీణ ప్రజల్లోకి నేతలు తీసుకు వెళ్లాలని ఆమె సూచించారు.