తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి , బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీస్తోందని విమర్శించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పార్టీ తరుపున పోటీ చేయనున్న అభ్యర్థులకు బీ ఫామ్ లను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గడిచిన ఐదారేళ్లలో ఏ మున్సిపాలిటీకి నిధులను కేటాయించలేదని ఆరోపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేస్తామని అరుణ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లేనని మండిపడ్డారు. టీఆర్ఎస్ పై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని.. ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.