తెలంగాణలో దళితులను వంచన చేసి రాజ్యాధికారంలోకి వచ్చిన చరిత్ర కేసీఆర్ కు ఉందన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 12 మంది దళిత బిడ్డలకు కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రంలో దళిత బంధు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారడంతోనే కేసీఆర్ పథనం మొదలయిందన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది చాలక.. దేశం మీద పడ్డారన్నారు.
కేసీఆర్ చాంబర్లో ఒక్క దళిత అధికారి కూడా లేడు. ఇది రాష్ట్ర దళిత సోదరులు గమనించాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పక్కకు పెట్టి చెరుకు రైతుల కడుపు కొట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆర్టీసీ వ్యవస్థలో మూడు వంతులు ప్రైవేటీకరణ చేసి సామాన్య ప్రజలను, ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ అన్యాయం చేసాడన్నారు.
తెలంగాణ ప్రజలను లిక్కర్ కు బానిస చేసి కార్మిక కర్షకులను దోచుకుంటున్న మహానుభావుడు కేసీఆర్ అని విమర్శించారు. విద్యను వ్యాపారం చేసి అనుచరులకు, బినామీలకు కట్టబెట్టి సామాన్య ప్రజానీకానికి విద్యను దూరం చేసే కుట్ర రాష్ట్రంలో జరుగుతుందన్నారు.
బీజేపీ పార్టీలో సామాన్యులు సైతం రాజ్యాధికారం చేస్తున్నారన్నారు. ఆ ఘనత మోడీకే చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో? తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు.