మాక్సిమం పాలిటిక్స్.. మినిమం రూలింగ్ అన్నట్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు, కవిత లిక్కర్ కేసు, పేపర్ లీకేజీ.. ఇలా అన్నింటినీ రాజకీయం చేసి.. తన అసమర్థత.. అవినీతి పాలనను కప్పిపుచ్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడని అన్నారు. కేసీఆర్ కు ప్రతీదీ రాజకీయం చేయడం పరిపాటి అయ్యిందని ఆరోపించారు. కోటి ఆశలతో పరీక్షలకు ప్రిపేర్ అయిన నిరుద్యోగులకు.. ఈ వార్త పిడుగు పడినట్లు అయ్యిందన్నారు.
ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి, సమగ్ర దర్యాప్తు చేయించి, కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపించి, దోషులు తప్పించుకోకుండా వారికి కఠిన శిక్ష పడేలా చూడాల్సిన ముఖ్యమంత్రి.. రాజకీయ రంగు పూసి తప్పించుకోవాలని చూడడం తన అసమర్థ పానలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. కేవలం నోటిఫికేషన్లతో సరిపెడుతున్నారని చెప్పారు. ఒకటి అర పరీక్షల్ని సైతం పకడ్బందీగా నిర్వహించలేని నిస్సహాయక స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఎంతో మంది తల్లులు కూలీ పని చేసి, తమ పిల్లలకు చదువులు చెప్పించి, ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి బాధ కేసీఆర్ కి అర్థం అవుతుందా? అని నిలదీశారు.
సర్వీస్ కమిషన్ పరీక్ష అంటేనే అత్యంత పగడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్ష అని.. అక్కడ సమర్థులను, నిజాయితీపరులకు అవకాశం ఇవ్వాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పరీక్షా పత్రాలు లీక్ అవ్వకుండా, అవినీతి జరగకుండా నిఘా పెట్టాలన్నారు. కానీ కేసీఆర్ ఇలాంటి వాటిపై కాకుండా.. ప్రత్యర్థి నాయకుల మీద నిఘా పెట్టేందుకు ఇంటిలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ దీనికి బాధ్యత వహించి, నిరుద్యోగుల ఆందోళన తొలగించాలని కోరారు.