తెలంగాణ ఆర్ధిక పరిస్థితి అప్పుల కుప్పని 2021-22 ఆర్థిక సంవత్సరానికి 36 వేలకోట్ల వడ్డీ కడతుందని ఈ విషయంపై మాట్లాడ్డానికి తాను బహిరంగ చర్చకుసైతం సిద్ధమని ఈటల ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రజల సొమ్ముతో ఓట్లుకొనే స్టంట్ మాస్టరని.. ప్రభుత్వం చేసే బడ్జెట్ రూపకల్పనంతా తప్పుల తడకని ఆయన ఆరోపించారు.
నీతి ఆయోగ్ డబ్బులు ఇస్తుందని, ఆ మేరకు వచ్చే సొమ్మును బడ్జెట్లో ప్రవేశపెడతామని చెప్పడం సిగ్గుచేటన్నారు. నీతి ఆయోగ్ కేవలం సిఫారసులు మాత్రమే చేస్తుందని డబ్బులు పెట్టే పరిస్థితి ఉండదని చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేస్తేనే కేంద్రం నుంచి డబ్బులువస్తాయని స్పష్టం చేసారు. ఇలా చెప్పడం ప్రజలను మభ్యపెట్టి, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చడమే అవుతుందని పేర్కొన్నారు.
GSDP ప్రకారం ఎంత అప్పు వస్తుందో అంతకన్నా ఎక్కువే బడ్జెట్ లో ప్రభుత్వం పెట్టిందన్నారు ఈటల. GSDP లో తెలంగాణకు లభించే అప్పు 27.2 శాతం కాగా FRBM పరిమితికి మించి అప్పులు చేసి అవసరాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణకు లభించే ఆదాయంలో సింహభాగం లిక్కర్ నుండి వచ్చేదేనని.. అది 45 వేల కోట్లుంటుదని తెలియజేసారు.
సర్కారు పేరు గొప్ప ఊరు దిబ్బా అనే చందంగా తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని తీసుకువచ్చారని మండిపడ్డారు ఈటల. సకాలంలో రాష్ట్రవాటా కట్టకపోతే తెలంగాణ తనకు వచ్చే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ లను కోల్పోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.