తెలంగాణలో రాజకీయం మే నెలలో మండుతున్న ఎండల కంటే వేడిగా తయారైంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌పై బీజేపీ నేత జితేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ ఎక్కడుందని అడిగిన టీఆర్ఎస్ నేతలకు.. ఉదండాపూర్ జనమే సమాధానం ఇచ్చారని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పనులు ఏమయ్యాయని నిలదీశారు. ఆ రిజర్వాయర్ ముంపు వాసుల నుంచి భూములు లాక్కున్న ప్రభుత్వం పునరావాసం, పరిహారం ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు.
టీఆర్ఎస్ ను చూసి ఉదండాపూర్ ప్రజలు ఛీ కొడుతున్నారని నిప్పులు చెరిగారు. దేశంలో ప్రధాని మోడీ నాయకత్వంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందని కొనియాడారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో బీజేపీ పాలన ఉందనే విషయాన్ని గుర్తుండచుకోవాలని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొడుతోందని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎన్ని అబద్దాలు చెప్పిన ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు జితేందర్ రెడ్డి.