తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగాన్ని తీవ్రంగా విమర్శించారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రాసి ఇచ్చిందే గవర్నర్ చదివారని.. ప్రభుత్వం గవర్నర్ కి ఇచ్చిన ప్రతిలో అన్ని అబద్ధాలు, తప్పులు ఉన్నాయని ఆరోపించారు.
నా ప్రభుత్వాము ధనిక రాష్ట్రమని.. దాన్ని అప్పుల పాలు చేశామని, దళితులను మోసం చేశామని ప్రసంగంలో ఉంటే బాగుండేదన్నారు. తెలంగాణ బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్నారు. దళిత బంధు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని చెప్పిస్తే బాగుండేదన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములు కబ్జాకి గురవుతున్నాయని, సామాన్యులను బెదిరించి భూములు లాక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన చూడలేదని.. కానీ ఇక్కడ చూస్తున్నామన్నారు.
గత బడ్జెట్ లో ఎంత పెట్టారు? ఎంత ఖర్చు చేశారు? చెప్పాలన్నారు. కేసీఆర్ బడ్జెట్ లు పెద్ద స్కామ్ చేశారని, ఆల్కాహాల్, పెట్రోల్, డీజిల్ ల మీదనే ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. అభివృద్ధి అంటే ఇది కాదని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.