ధాన్యం కొనుగోళ్లపై ఓవైపు టీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తోంది. అటు కేసీఆర్ ఢిల్లీలో ఉండి చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అబద్ధపు ప్రచారానికి బలం ఉండదని.. మళ్లీ మళ్లీ ఢిల్లీ ప్రయాణం.. ప్రజల దృష్టిని మరల్చేందుకేనని మండిపడ్డారు.
దేశంలో ధాన్యం సేకరణలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. మరి వివక్ష ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపించడం లేదని స్పష్టం చేశారు. అబద్ధాలతో కేసీఆర్ రాజకీయ లబ్ది పొందేందుకు చూస్తున్నారని విమర్శించారు.
కేంద్రంపై నిందలు వేసి రైతుల్లో వ్యతిరేకత పెంచాలనేదే కేసీఆర్ ప్లాన్ గా చెప్పారు మురళీధర్ రావు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని ఒప్పుకుని సంతకం చేశారో..? లేదో? టీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలనా వైఫల్యాలను ప్రజలకు తెలియకుండా చేసేందుకు కేసీఆర్ రోజుకో డ్రామా చేస్తున్నారని విమర్శించారు.
ధాన్యం అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఫైరయ్యారు. ఇన్నాళ్లూ ధాన్యాన్ని కేంద్రం కొంటుంటే.. తామేనని చెప్పుకుకోలాదా? అని నిలదీశారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు మురళీధర్ రావు.